రాజధాని నిర్మాణం ఎక్కడ ఏర్పాటు కానుందో అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం సేకరించి అమరావతి చుట్టుపక్కల పలువురు భూములు కొనుగోలు చేశారని పేర్కొంటూ వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కె. శ్రీహాస, కిలారు. రాజీవ్, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వీ, లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ .. ' రాజధాని నగర ప్రాంతానికి వెలుపల భూములు కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేయడమే తప్పు ఎలా అవుతుంది. 2014 నుంచే అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. భూ యజమానులు స్వచ్ఛందంగా విక్రయించడంతో పిటిషనర్లు కొనుగోలు చేశారు. కొనుగోళ్ల వెనుక కుట్ర ఉందనేందుకు ఆధారాలు లేవు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయండి' ఆయన కోర్టును కోరారు.
కొనుగోళ్లలో నేరపూరిత కుట్ర ఉంది : ఏజీ