Medical PG Admissions issue on HC: పీజీ మెడికల్ కౌన్సిలింగ్ సర్వీసు కోటాలో సీట్ల భర్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు తప్పుపట్టింది. ఆ జీవోలోని కొన్ని భాగాల్ని రద్దుచేసింది. సర్వీసు కోటాను ఏపీలో పనిచేస్తున వైద్యులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని స్పష్టంచేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 95, అధికరణ 371 డీ ప్రకారం కల్పించిన ప్రయోజనాలు పదేళ్లపాటు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ జీవో సెక్షన్ 95ను ఉల్లంఘిస్తోందని తెలిపింది. పిటిషనర్లు ఏపీ ప్రభుత్వ ఇన్ సర్వీసు కోటాకు స్థానికులుగా అర్హులవుతారని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు ఇచ్చింది.
పీజీ సీట్ల భర్తీకి ఏపీలో పనిచేస్తున్న ఇన్ సర్వీసు వైద్యులు మాత్రమే అర్హులుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణలో సేవలందిస్తున్న వైద్యులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ విజభన చట్టం, అధికరణ 371 డీ ప్రకారం పదేళ్ల పాటు ప్రయోజనాలు కల్పించాలన్నారు . ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.