కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నిపుణులతో తనిఖీలకు వచ్చినప్పుడు అడ్డు చెప్పొద్దని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. తనిఖీలకు సహకరించాలని పేర్కొంది. మరోవైపు తనిఖీలకు వెళ్లే ముందు ఆ పరిశ్రమలకు నోటీసులు జారీచేయాలని ఏపీపీసీబీకి హైకోర్టు స్పష్టం చేసింది. తనిఖీ నివేదికలను కోర్టుకు సమర్పించాలని పీసీబీని ఆదేశించింది.
తనిఖీ నిర్వహణకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అమర్ రాజా బ్యాటరీస్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు , న్యాయవాది. ఎం.బాలాజీ ధర్మాసనానికి తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారన్నారు . తనిఖీలకు తాము సహకరించడం లేదంటూ పీసీబీ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో 8 మంది ఉద్యోగులను లెడ్ రహిత ప్రాంతంలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పీసీబీ జారీ చేసిన మూసివేత ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ , జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.