ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ ఉన్న కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని ప్రత్యేక న్యాయస్థానాలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఏసీబీ, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులకు తెలంగాణ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ జరపాలని..ప్రత్యేక న్యాయస్థానాలను ఆదేశించింది. తదుపరి సూచనల నిమిత్తం విచారణకు సంబంధించి రోజువారీ నివేదికను రిజిస్ట్రీకి సమర్పించాలని పేర్కొంది.
118 కేసులు పెండింగ్
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ కోసం తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో 118 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసులన్నీ ఐపీసీ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, రైల్వే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినవి ఉన్నాయి. మనీలాండరింగ్, సీబీఐ, ఏసీబీకి సంబంధించిన ప్రత్యేక కోర్టుల్లో 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో సగానికిపైగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించినవే కేసులున్నాయి. జగన్‌పై సీబీఐ 11, ఈడీ 5 కేసులు నమోదు చేశాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జగన్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది.