ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: ఆ కేంద్రాలకు.. వైకాపా రంగులను తొలగించండి: హైకోర్టు - ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు

hc fire on ysrcp colors
hc fire on ysrcp colors

By

Published : Sep 16, 2021, 2:16 PM IST

Updated : Sep 17, 2021, 5:34 AM IST

14:14 September 16

వైకాపా రంగులను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశం

   చెత్త (వ్యర్థాల)నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు వైకాపా జెండా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీ రంగులు ఆ కేంద్రాలకు ఎలా వేస్తారని ప్రశ్నించింది. వెంటనే  తొలగించాలని స్పష్టం చేసింది. ఇక మీదట ఆ రంగులు వేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా సంపద సృష్టించే కేంద్రాలకు వైకాపా రంగులేసిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని, పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలని పేర్కొంది. అందులో వివరాలు సంతృప్తికరంగా లేకపోతే మళ్లీ కోర్టుకు పిలవాల్సి ఉంటుందని.. గోపాలకృష్ణ ద్వివేది, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీకి చెప్పింది. విచారణను వచ్చేనెల 6కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. 

   గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో.. తడి, పొడి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని ప్రశ్నిస్తూ ‘జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌’ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరస సురేశ్‌కుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిరువురూ గురువారం కోర్టుకు హాజరయ్యారు. వారి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫలానా రంగులేయాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదన్నారు.

    పిటిషనర్‌ కోర్టు ముందు ఉంచిన ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం.. పాతర/డబ్బా(బిన్‌)లకు నిర్దిష్ట రంగు ఒక్కటే వేయాల్సి ఉంటే వైకాపా జెండా రంగులు వేసినట్లు స్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ విధంగా ఎన్ని కేంద్రాలకు వేశారని అధికారులను ప్రశ్నించగా.. నాలుగు పంచాయతీల్లో వేసినట్లు తమ దృష్టిలో ఉందన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కేంద్రాలకు వైకాపా రంగులు వేస్తున్నారన్నారు. 

ఇదీ చదవండి: 

High Court: పరిషత్‌ పోరు ఫలితాల వెల్లడికి హైకోర్టు పచ్చజెండా

Last Updated : Sep 17, 2021, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details