తీవ్రవాదుల దాడిలో మృతి చెంది కీర్తిచక్ర పురస్కారాన్ని పొందిన అధికారి కుటుంబానికి సాయంగా ఉంటామని ప్రకటించి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్న రెవెన్యూ అధికారుల తీరుపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన తీవ్రవాదుల దాడిలో.. రాయబారిగా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి వాడపల్లి వెంకటేశ్వరరావు(VADAPALLI VENKATESHWARA RAO) మరణించారు. కాగా ఆయన కుటుంబానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 475 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ... 2014లో జీవో జారీ చేసింది. అయితే ఆ స్థలాన్ని అధికారులు ఇప్పటి వరకు అప్పగించలేరు.
ఇంకెంత కాలం ఇలా తిప్పుకుంటారు..?
ఏడేళ్లయినా ఫ్లాట్ అప్పగించకపోవడంతో వాడపల్లి వెంకటేశ్వరరావు భార్య మాలతీరావు హైకోర్టుకు లేఖ రాశారు. స్పందించిన ధర్మాసనం ఆ లేఖనే పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి(JUSTICE HIMA KOHLI), జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీవోలో పేర్కొన్న 58వ ప్లాటు 475 చదరపు గజాలని ఉందని తెలిపారు. కానీ సర్వే నిర్వహిస్తే 411 గజాలు మాత్రమే ఉందన్నారు. కొంత గడువిస్తే తగిన ప్లాటు కేటాయిస్తామని ఆయన హైకోర్టుకు విన్నవించారు. కాగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కలెక్టర్ సూచనల మేరకు ప్రత్యామ్నాయంగా మరో ప్లాట్‌ను పిటిషనర్ ఎంపిక చేసుకోగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. జీవో జారీ చేసి ఏడేళ్లయిందని, ఇంకెంతకాలం ఇలా తిప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది.