ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదనపు ఏజీ తీరు ధిక్కారమే! : హైకోర్టు - aag ponnavolu sudhakar reddy

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వాదనల సందర్భంగా అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వాదనలు ధిక్కారపూరిత స్వభావమైనవిగా అనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మరోమారు ఇలాంటి వ్యవహారశైలిని ప్రదర్శిస్తే చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానం వెనుకాడబోదని తేల్చిచెప్పారు.

high court fire on aag ponnavolu sudhakar reddy
అదనపు ఏజీ తీరు ధిక్కారమే! : హైకోర్టు

By

Published : May 23, 2021, 5:23 AM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వాదనల సందర్భంగా అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వాదనలు ధిక్కారపూరిత స్వభావమైనవిగా అనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏఏజీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడానికి, తగిన చర్యలు తీసుకోవాలంటూ బార్‌ కౌన్సిల్‌కు సిఫారసు చేయడానికి ఇది సరైన కేసు అన్నారు. న్యాయస్థానం ఉదారత చూపుతూ ప్రస్తుతం అలాంటి చర్యలకు ప్రతిపాదించడం లేదన్నారు. మరోమారు ఇలాంటి వ్యవహారశైలిని ప్రదర్శిస్తే చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానం వెనుకాడబోదని తేల్చిచెప్పారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌, మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో, ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు నిర్దేశించిన సమయంలో నివేదికను పంపడంలో విఫలమైన మెడికల్‌ బోర్డు ఛైర్మన్‌, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం 19న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. న్యాయమూర్తులు వేర్వేరుగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

నేపథ్యమిదే..
కస్టడీలో ఉన్న తనను సీఐడీ పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు రిమాండుకు హాజరుపరిచిన సందర్భంగా గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి/మెజిస్ట్రేట్‌ ముందు ఈ నెల 15న (శనివారం) వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ కాలికి అయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో ఆయన తరఫు న్యాయవాది అదే రోజు సాయంత్రం హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని వ్యాజ్యంగా తీసుకున్న హైకోర్టు ఈ నెల 15న అత్యవసరంగా విచారణ జరిపింది. ఎంపీకి పరీక్షలు నిర్వహించి సీల్డ్‌ కవర్లో నివేదిక ఇవ్వాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలోని మెడికల్‌ బోర్డును ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 16న సాయంత్రం 6:30 గంటలకు నివేదిక హైకోర్టుకు చేరింది. దానిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. కస్టడీలో ఉండగా సీఐడీ పోలీసులు కొట్టారని ఎంపీ చెప్పిన నేపథ్యంలో జీజీహెచ్‌తో పాటు గుంటూరు రమేశ్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని మే 15న గుంటూరు మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను ‘తక్షణం’ అమలు చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం 19న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. రమేశ్‌ ఆసుపత్రిలో ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశారా లేదా అని అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. రమేశ్‌ ఆసుపత్రికి తరలించే విషయంలో 16న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి అదేరోజు రాత్రి 11 గంటలకు పోలీసులకు అందిందని, ఎంపీని సికింద్రాబాద్‌లోని సైనికాసుపత్రికి తరలించాలని 17వ తేదీ మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది.


గొంతు పెద్దది చేస్తూ.. భయపెట్టేలా మాట్లాడారు: జస్టిస్‌ లలిత
‘అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గొంతు స్థాయిని పెంచుతూ కోర్టును భయపెట్టే వ్యవహారశైలితో అధికరణ 226 కింద కోర్టు జారీచేసిన ఫ్రాడ్‌ (మోసం/వంచన), ‘ఇల్లీగల్‌ (చట్టవిరుద్ధమైన) ఉత్తర్వులను అమలు చేయడానికి వీల్లేదని వాదించడం ప్రారంభించారు. మెజిస్ట్రేట్‌ జారీ చేసిన ఇల్లీగల్‌ ఆర్డర్‌ అమలుకు హైకోర్టు వేదికగా మారిందన్నారు. ఏఏజీ ఆరోపిస్తున్నట్లు ఉత్తర్వులు ఇల్లీగల్‌, ఫ్రాడ్‌ ఆర్డర్‌ అయితే దానిపై అప్పీల్‌ చేసుకోవచ్చు. కోర్టు ఉత్తర్వులను అమలు చేశారా లేదా? అని అడిగాం. ఏజీ బదులిస్తూ కోర్టు ఉత్తర్వుల ప్రతి రాత్రి 11 గంటలకు అందిందన్నారు. రాత్రి జైలు ద్వారాలు తెరిచి ఆసుపత్రికి తరలించాలా? అని కోర్టును ప్రశ్నించారు’ అని జస్టిస్‌ లలిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘రాత్రి కుదరకపోతే ఉదయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాం. ఎంపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అందుకని హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని ఏఏజీ చెప్పారు. బెదిరించే విధంగా గొంతును కొనసాగిస్తూ... తాను చెప్పింది కోర్టు విని తీరాల్సిందేనన్నారు. లోతైన అంశాల్లోకి వెళ్లి వాదనలు చెప్పడానికి కోర్టు అనుమతించకపోతే ‘వాకౌట్‌’ చేస్తానన్నారు. స్వరం పెద్దది చేస్తూ.. ఈ కేసులో కోర్టుకు ప్రత్యేక ఆసక్తి ఏమిటి? న్యాయవాది రాసిన లేఖను అంగీకరించి ఈ కేసును విచారించేంత ప్రత్యేకత ఏమిటి అని కోర్టుపై బురద చల్లుతూ దురుద్దేశాలు ఆపాదించారు. దీంతో కోర్టు ఆఫీసరుగా వినియోగించే పదాలపై నియంత్రణ పాటించాలని ఏఏజీకి న్యాయస్థానం హెచ్చరిక చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా నిందాపూర్వక, నిస్సార ఆరోపణలు చేయడం సరికాదని ఏఏజీకి తెలిపింది.


ఆ ఫొటోలు చూశాక న్యాయ తలుపులు మూసుకోలేం
కస్టడీలో ఉన్న ఎంపీని పోలీసులు కొట్టారని, నడవలేని స్థితిలో ఉన్నారని, సంబంధిత ఫొటోలను చూడాలని లేఖ అందిన సందర్భంలో హైకోర్టు న్యాయ తలుపులు మూసుకొని ఉండలేదు. నిందితులకు సైతం హక్కులుంటాయి. వాటిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నిందితుల హక్కులకు విఘాతం కలిగేలా ప్రభుత్వ వ్యవహరిస్తే.. వారి హక్కుల రక్షకుడిగా ఆపద నుంచి కాపాడేందుకు ముందుకు రావడానికి న్యాయస్థానం ఏ విధంగానూ సంశయించదు. ప్రజల హక్కులను కాపాడేందుకు కోర్టులు ముందుకు రాకపోతే.. న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలు విశ్వాసం కోల్పోతారు. నిందితుడు ఎంపీనా, సాధారణ వ్యక్తా అనే విషయంలో న్యాయస్థానానికి ఎలాంటి తేడా ఉండదు. ఇల్లీగల్‌, ఫ్రాడ్‌ ఆర్డర్‌ అని, జైలు ద్వారాలు రాత్రి 11 గంటలకు తెరవలేమని, నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారనే కారణాలతో కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కారణాలేవీ కోర్టును ఒప్పించేవిగా లేవు. రమేశ్‌ ఆసుపత్రిలో వైద్యపరీక్షల తక్షణ నిర్వహణ నిమిత్తం ఉత్తర్వులిచ్చాం. రాత్రి 11 గంటలకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి సాధ్యం కాలేదనుకున్నా.. మరుసటి రోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చే వరకు ఎందుకు అమలు చేయలేదు? ఏఏజీ వాదన అంతా హైకోర్టు ఇచ్చింది ఇల్లీగల్‌ ఆర్డర్‌ అంటూనే సాగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే అదనపు ఏజీ వాదనల సందర్భంగా మొండితనం/కఠోర వ్యవహారశైలి, అహంకారంతో వ్యవహరించడం కోర్టును విస్మయానికి గురిచేసింది.


న్యాయవాది పెద్దమనిషిలా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. న్యాయవాది మొదట పెద్దమనిషి (జంటిల్‌మెన్‌)గా ఉండాలి. తన సహచరుల్లో, న్యాయస్థానాల్లో ఉన్న మంచిపేరు, గౌరవం అయనకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి. కోర్టు వ్యతిరేకంగా ఉందన్న కారణంతో అదే కోణంలో వాదనలు వినిపించాల్సిన అవసరం లేదు. కోర్టు పట్ల అమర్యాదపూర్వకంగా, పరుషంగా, అగౌరవంగా, ప్రతిష్ఠను దిగజార్చేలా, బెదిరించేలా భాష, ఆవేశం ప్రదర్శిస్తారని కోర్టు భావించదు.


భయపెట్టేలా మాట్లాడే హక్కు ఏ న్యాయవాదికీ లేదు
నిష్పాక్షికంగా, నిర్భీతిగా తన విధులను న్యాయవ్యవస్థ నిర్వహిస్తుందన్న ప్రజల విశ్వాసం, నమ్మకమే దానికి పునాది. న్యాయస్థానం మర్యాదను కాపాడేలా న్యాయవాదులు వ్యవహరించాలి. పవిత్రమైన, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న న్యాయవాది ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. న్యాయస్థానాన్ని భయపెట్టేలా మాట్లాడే హక్కు ఏ న్యాయవాదికీ లేదు. కక్షిదారుడు (క్లయింట్‌)గా తానే పరకాయప్రవేశం చేసి వాదనలు వినిపించేలా గుర్తింపు తెచ్చుకోకూడదు. ఏఏజీ వాదనలు ప్రాథమికంగా చూస్తే ధిక్కార స్వభావం కలిగి ఉన్నాయి’ అని న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉదార స్వభావంతో ఆయనపై చర్యలకు సిఫార్సు చేయడం లేదని స్పష్టం చేశారు.

ఏఏజీ నియంత్రణ పాటించాల్సింది: జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

అధికారులపై సుమోటో కోర్టుధిక్కరణ కేసు ప్రారంభించే విషయంలో జస్టిస్‌ లలిత అభిప్రాయంతో అంగీకరిస్తున్నానని జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వాదనల సందర్భంగా ఏఏజీ కొంత నియంత్రణ ప్రదర్శించి ఉండాల్సిందని భావిస్తున్నానన్నారు. కోర్టులో జరిగే వాదోపవాదాల్లో నియంత్రణ పాటించడం ఓ ప్రామాణిక చిహ్నం (హాల్‌మార్క్‌) అని వ్యాఖ్యానించారు. వాదనల్లో పదప్రయోగం తగిన విధంగా ఉండాలన్నారు. కోర్టులో జరిగే విచారణలో ఏఏజీ హుందాతనంగా వ్యవహరిస్తూ, శ్రేష్ఠమైన పదాల్ని వినియోగించాలని ఆయన హితవు పలికారు.

ఇదీచదవండి.

నేటి నుంచి ఏపీ వాసులకు ఈ-పాస్‌ తప్పనిసరి: తెలంగాణ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details