HIGH COURT: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జాస్తి కృష్ణకిశోర్‌పై గతంలో మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా దానికి సంబంధించిన లిఖిత పూర్వక ఉత్తర్వులు బయటపడ్డాయి. ఈడీబీ సీఈవోగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ గతంలో కృష్ణకిషోర్‌పై మంగళగిరి సీఐడీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై కృష్ణకిషోర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణకిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గాని, లాభపడినట్లు గాని ఎక్కడా అధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా సీఎం జగన్‌పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా కేసు పెట్టినట్లు అభిప్రాయపడింది. భజన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టివేసినట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది.
కృష్ణకిషోర్ హైదరాబాద్ ఆదాయపు పన్నుశాఖ సర్కిల్లో పని చేసిన సమయంలో జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు ఇచ్చారని.. దాన్ని మనసులో పెట్టుకుని కక్షసాధింపుగా అధికారంలోకి వచ్చిన తరువాత సస్పెండ్ చేసి.. తప్పుడు కేసు బనాయించినట్లు కృష్ణ కిషోర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.