ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: పంచాయతీలుండగా..గ్రామ సచివాలయాలు ఎందుకు?

గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్ వ్యవస్థ ఉండగా....దానికి సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఎందుకని...హైకోర్టు ప్రశ్నించింది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను లాగేసుకొనే చర్యలేంటని...నిలదీసింది. పంచాయితీ సర్పంచ్, కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేయటంపై దాఖలైన పిటీషన్‌ను.. విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

High Court
High Court

By

Published : Jun 16, 2021, 4:17 AM IST

పంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. దానికి సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ఎందుకు? సంక్షేమ పథకాల్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాన్ని పంచాయతీల ద్వారా నిర్వహిస్తే తప్పేముంది? - హైకోర్టు

ప్రభుత్వ పథకాల్ని పంచాయతీల ద్వారానే ఎందుకు అమలు చేయకూడదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంలాగే.. గ్రామ పంచాయతీకి సర్పంచి అధిపతి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న జారీచేసిన జీవో-2పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. గ్రామ పంచాయతీలకు నిధులు పెంచి, మౌలిక సదుపాయాలను ఎందుకు పెంచకూడదని అడిగారు. పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. వీఆర్వోలకు అధికారాలు అప్పగించడం పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను లాగేసుకోవడం కాదా? అని వ్యాఖ్యానించారు.

గతంలో ఇచ్చిన జీవోలు 110, 149లకు విరుద్ధంగా జీవో 2 ఉందన్నారు. విద్యార్హతలు ఎక్కువ ఉన్న సిబ్బంది.. వీఆర్వోల కింద పనిచేయాల్సి వస్తోందన్నారు. వ్యవస్థను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి సూచించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు ముగియడంతో జీవో అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

కేసు వివరాలు ఇవీ...
జీవో2ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తోకలవానిపాలెం సర్పంచి టి.కృష్ణమోహన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల హక్కుల్ని హరించేలా జీవో ఉంది. గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి వీఆర్వోలకు అధికారాలు అప్పగించారు. సర్పంచి కంటే వీఆర్వోకు ఎక్కువ అధికారాలు కల్పించారు. ఇది 73వ రాజ్యాంగ సవరణకు, ఏపీ పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధం. పంచాయతీ కార్యాలయాలనే గ్రామ సచివాలయాలుగా మార్చేశారు. వీఆర్వో వ్యవస్థ పంచాయతీ కార్యదర్శి వ్యవస్థను నియంత్రిస్తోంది. సర్పంచులు నామమాత్రం అయ్యారు. నవరత్నాల అమలు కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేశారు. జీవో అమలును నిలుపుదల చేయండి’ అని కోరారు. ప్రభుత్వం తరఫున ఏజీ వాదిస్తూ.. 'పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాలకు ఆటంకం లేదు. సంక్షేమ పథకాల్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికే గ్రామ సచివాలయాలు, వీఆర్వో వ్యవస్థను తీసుకొచ్చాం' అన్నారు.

ఇదీ చదవండి:

Ambati: 'ప్రభుత్వ భూములను రక్షిస్తే..కక్ష సాధింపు ఎలా అవుతుంది'

ABOUT THE AUTHOR

...view details