‘మిషన్ లీగల్ సర్వీసెస్’ కార్యక్రమాన్ని పేదలకు న్యాయం అందించే న్యాయ సహాయ ఉద్యమంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర అభివర్ణించారు. న్యాయ సహాయం(లీగల్ ఎయిడ్) కార్యక్రమం విజయవంతం కావడానికి న్యాయ విద్యార్థులు వెన్నెముక లాంటి వారన్నారు. ప్రజలకూ న్యాయ వ్యవస్థకూ మధ్య వారధిలా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, నిరుపేదలకు న్యాయ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ చేపట్టిన ‘మిషన్ లీగల్ సర్వీసెస్’ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర హైకోర్టు ప్రాంగణంలో మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా న్యూదిల్లీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు మిషన్ లీగల్ సర్వీసెస్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, తుళ్లూరు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకొని మిషన్ లీగల్ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయన్నారు. ఆ గ్రామాల్లో న్యాయసేవల కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమం తర్వాత.. దత్తత తీసుకున్న రెవెన్యూ గ్రామాల పర్యటనకు సిద్ధం చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మంగళవారం నియమితులైన జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ పేదల హక్కుల రక్షణకు పలు చట్టాలున్నా వాటిపై ప్రజలకు అవగాహన ఉండటం లేదన్నారు. అవగాహన కల్పించే బాధ్యత న్యాయ విద్యార్థులు తీసుకోవాలన్నారు.