కర్నూలుకు కార్యాలయాలు తరలించే జీవోతో పాటు విశాఖలోని మిలీనియం టవర్ బి నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎమ్. రమేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజధాని నగర నిర్మాణ పనులను అమరావతిలో కొనసాగించాలని కోరారు. రాజధాని వ్యవహారంలో పలువురు ఐఏఎస్ అధికారులు సర్వీసు నిబంధనలను అనుసరించడంలేదని పిటిషనర్ తరపు న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నారావారిపల్లెలో నిర్వహించిన సభలో పాల్గొని రాజకీయ ఉపన్యాసాలు చేశారన్నారు. పబ్లిక్ సర్వెంట్లుగా ఉంటూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ధర్మాసనానికి విన్నవించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యాలయాల తరలింపులో భాగంగా విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణ పనులకు నిధులు కేటాయించినట్లు కోర్టుకు తెలిపారు. ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారని... ఐఏఎస్ అధికారులు మిలీనియం టవర్‌ను పరిశీలించారని తెలిపారు. మంగళగిరిలో అన్ని వసతులతో సీఐడీ కార్యాలయం ఉండగా... విశాఖలో మళ్లీ కార్యాలయం ఏర్పాటుకు అన్వేషిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అమరావతిలో రైతులు నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం పరోక్షంగా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేలా చర్యలు చేపడుతోందన్నారు. ఈ ప్రక్రియను నిలువరించాలని జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టుకు తెప్పించి పరిశీలించాలని కోరారు. రమేశ్ తరపున న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదుల జాబితాలో ఉన్న సీఎం, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తామని మౌఖికంగా తెలిపింది.