'59.85 శాతం రిజర్వేషన్లు చట్ట విరుద్ధం'
14:50 March 02
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లకు వీలు కల్పిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్లు 9(1ఏ), 15(2), 152(1ఏ), 153(2ఏ), 180(1ఏ), 181(2బీ) చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని పేర్కొంది. 50 శాతానికి మించి కోటా ఇవ్వడం సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను 50 శాతానికి లోబడి తిరిగి నిర్ణయించేందుకు (రీడిటర్‌మైన్) ప్రభుత్వానికి నెల రోజుల సమయమిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్సీ (19.08 శాతం), ఎస్టీ (06.77 శాతం), బీసీ (34 శాతం) రిజర్వేషన్లను 59.85 శాతంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబరు 28న జారీ చేసిన జీవో 176తో పాటు జీవోకు అనుగుణంగా తీసుకున్న చర్యలన్నింటినీ రద్దు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలో ఇప్పటికే ఏడాదిన్నర జాప్యం జరిగిందని గుర్తు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 59.85 శాతంగా పేర్కొంటూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి 2019లో జీవో 176 జారీ చేశారు. ఆ జీవోతోపాటు, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ బి.ప్రతాప్‌రెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. బీసీ జనాభాపై సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించకుండా ఊహాజనితంగా 34శాతం రిజర్వేషన్లను కల్పించడం సరికాదని వాదించారు. మొదట ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఇటీవల ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. సోమవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన వాదనలను తోసిపుచ్చింది. కోటా 50 శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 3 నాటికి గ్రామ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలను పూర్తి చేస్తామంటూ హైకోర్టులో కౌంటరు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది.