జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన "శేఖర్" చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా.. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఆడుతోన్న అన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ చిత్రానికి సంబంధించి జీవిత రాజశేఖర్.. రూ.65 లక్షలు చెల్లించాలంటూ ప్రముఖ ఫైనాన్షియర్ పరందామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. 48 గంటల్లో ఆ డబ్బును డిపాజిట్ చేయాలని.. లేనిపక్షంలో చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాల్సి వస్తుందని కోర్టు పరందామరెడ్డికి అనుకూలంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. కోర్టు ఆదేశించిన సమయానికి డబ్బు డిపాజిట్ చేయని కారణంగా శేఖర్ చిత్ర ప్రదర్శనలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
రాజశేఖర్ భావోద్వేగం..: తన సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడంపై నటుడు రాజశేఖర్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. తాను, తన కుటుంబం శేఖర్ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డామని పేర్కొన్నారు. కొందరు కావాలనే కుట్ర పన్ని సినిమా ప్రదర్శనలను అడ్డుకున్నారని ఆరోపించారు. సినిమా అంటే తమకు ప్రాణమని, ప్రత్యేకంగా శేఖర్ చిత్రంపై తన కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంతో కష్టపడి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని.. మంచి స్పందన కూడా వస్తోందని రాజశేఖర్ తెలిపారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయడం పట్ల రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యారు.