పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge)ను ఆరంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ (hero Dulquer Salmaan) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హరిత సవాల్లో భాగంగా కథానాయిక అదితిరావు సవాల్ విసిరారు. ఛాలెంజ్‌ను స్వీకరించిన దుల్కర్ హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో మొక్కలు నాటారు. తన వంతు బాధ్యతను చాటుకున్నారు.
తన తాజా చిత్రం కురుప్ ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన దుల్కర్... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విషయాన్ని గుర్తుచేసుకుని కేబీఆర్ పార్క్‌కు వెళ్లి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్న దుల్కర్... ప్రతి ఒక్కరు ఈ సవాల్‌ను స్వీకరించాలని పిలుపునిచ్చారు.
హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులు భాగస్వాములయ్యారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా... ఇప్పటికే 16 కోట్లకు పైగా మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రజలు పండగలా జరుపుకునే ఏ సందర్భం వచ్చినా.. అందులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాగం చేస్తూ ఎంపీ సంతోష్ హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు.