SECURITY: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లలో హింసాత్మక, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైల్వే అదనపు డీజీపీ కుమార్ విశ్వజిత్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తిరుపతి రైల్వేస్టేషన్‌ను ఎస్పీ పరమేశ్వర రెడ్డితో కలిసి పరిశీలించారు. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ అధికారులకు, బందోబస్తు సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ఆందోళనకారులు ‘చలో గుంటూరు’ కార్యక్రమానికి వెళ్లకుండా తీసుకున్న ముందస్తు చర్యలను అభినందించారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తూ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. రైల్వేస్టేషన్‌లోకి సంఘ విద్రోహశక్తులు రాకుండా నిఘా ఉంచాలని సూచించారు.
యథావిధిగా రైళ్ల రాకపోకలు
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసుల పహారా కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణికుల రాకపోకలు సాగుతున్నాయి. స్టేషన్‌కు రెండు వైపులా ఉన్న ప్రవేశ మార్గాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు కాపలా కాస్తున్నారు. అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్పీఎఫ్, జీఆర్పీ, సీఆర్‌పీఎఫ్, సివిల్ పోలీసులు రైల్వేస్టేషన్‌లో కవాతు నిర్వహించారు. స్టేషన్‌లోని అన్ని ప్లాట్ ఫారాల్లో తిరుగుతూ ‘రైల్వే ఆస్తులు మనందరివి, ధ్వంసం చేయొద్ద’ని ప్రయాణికులను చైతన్యం చేశారు. స్టేషన్ లోపల, బయట భద్రత పెంచడంతో పాటు టికెట్ లేని వారిని అనుమతించలేదు. రైళ్లు యథావిధిగా నడవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో కొందరు శనివారం రిజర్వేషన్లు రద్దు చేసుకోగా, ఆదివారం ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో స్టేషన్ ప్రయాణికులతో సందడిగా కనిపించింది.
ఇవీ చదవండి: