గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. శ్రీరామసాగర్ నుంచి భద్రాద్రి వరకు నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి భారీగా వరద వస్తుండటంతో ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు శ్రీరామసాగర్ 9 వరద గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మరో 10 వేల క్యూసెక్కులు వరద కాలువకు విడుదల చేస్తున్నారు.
వాస్తవానికి పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు చేరాక గాని మిగులు జలాలు వదలరు. గోదావరికి వరద పోటెత్తుతుండటం, సోమ, మంగళ వారాలు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందుగానే గేట్లు తెరిచారు. గడిచిన రెండు రోజుల్లోనే ప్రాజెక్టులో 41 టీఎంసీల నిల్వ పెరిగింది. శుక్రవారం 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 30 టీఎంసీల నిల్వ ఉంది. ఆదివారం సాయంత్రానికి 1086 అడుగుల వద్ద 71 టీఎంసీలు నిల్వ ఉంది.
శనివారం 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే ఆదివారం ఉదయానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. సాయంత్రానికి 2.75 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు 27 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి 3,44,239 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పార్వతి (సుందిళ్ల) బ్యారేజీకి వదిలారు. సరస్వతి(అన్నారం) బ్యారేజీకి 3.55 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 50 గేట్లు తెరిచి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.
లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి 9.96 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 75 గేట్లను ఎత్తి దిగువకు అంతే మొత్తం వదులుతున్నారు. భద్రాద్రి జిల్లా పేరూరు వద్ద శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 14.73 అడుగుల మట్టం పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఆదివారం రాత్రి 12 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.. పెదవాగు సామర్థ్యం 0.6 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరటంతో 4,028 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు కృష్ణా పరీవాహకంలోనూ వరద పెరుగుతోంది. ఆలమట్టి జలాశయానికి ఎగువన ఉన్న డ్యాంలన్నీ నిండటానికి చేరువయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఆలమట్టి నుంచి దిగువకు భారీ ప్రవాహం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి ఈ జలాశయానికి 75,149 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. తుంగభద్ర జలాశయానికి కూడా 88,287 క్యూసెక్కులు వస్తోంది. 12 గంటల వ్యవధిలో 3.81 టీఎంసీల నీల్వ చేరుతోంది. ఆలమట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి 5 రోజుల వ్యవధిలో దిగువకు ప్రవాహం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.