ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Heavy rains in Telangana: వాన నష్టాలు.. ప్రజలకు కష్టాలు.. - హైదరాబాద్ తాజా వార్తలు

Heavy rains in Telangana: గత వందేళ్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు మునిగి, ఇళ్లు కూలుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Heavy rains in Telangana
వాన నష్టాలు.. ప్రజలకు కష్టాలు

By

Published : Jul 14, 2022, 10:26 AM IST

Heavy rains in Telangana: ఎడతెరపిలేని వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంత కుంభవృష్టి కురుస్తోంది. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల్‌ గ్రామంలో ఇల్లు కూలి ఏదుల చిన్నయ్య (65) అనే వృద్ధుడు మృతి చెందారు. మూడు రోజులుగా రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న అతి భారీ వర్షాలు బుధవారం కూడా అదేస్థాయిలో కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి అయిదు రోజులుగా బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం నుంచి రాంనగర్‌ వెళ్లే రోడ్డు మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట, వాజేడు, వెంకటాపురం తదితర మండలాల్లో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మొక్కజొన్న పొలాల్లో నుంచి వరద నీరు వేగంగా బయటికి వెళ్లేలా రైతులు చర్యలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది.

వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వర గ్రామం సమీపంలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మహాముత్తారం మండలంలోని యత్నారం గ్రామం జలదిగ్బంధంలో ఉంది. ఏటూరునాగారం మండలం రొయ్యూరులో బుధవారం మేతకు వెళ్లిన గేదెలను గోదావరి వరద చుట్టుముట్టడంతో వాటిలో కొన్ని కొట్టుకుపోయాయి. మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ జిల్లాల్లో 50 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల తారురోడ్డు వరదకు లేచిపోయింది. 20 కల్వర్టులు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 35 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

* నిజామాబాద్‌ జిల్లాలో 27,802 ఎకరాల పంటలు పూర్తిగా వరదనీటలో మునిగిపోయాయి. మొత్తం 8 ఇళ్లు పూర్తిగా, మరో 131 పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు 20 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి.

లోతట్టు ప్రాంతాల్లోని 1500 మంది తరలింపు:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాటారం, పలిమెల, మహా ముత్తారం మహాదేవపూర్‌ మల్హర్‌ మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల్లోని 1500 మందిని తరలించారు. ఈ జిల్లాలో 70 పశువులు మృతి చెందాయి. 35 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 55 విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. మొత్తం 13,280 ఎకరాల పత్తి, 1500 ఎకరాలకు సరిపడే వరి నారుమళ్లు మునిగిపోయాయి. 600 ఇళ్ల గోడలు, 35 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. పెద్దంపేట వాగు వంతెన సమీపంలో రోడ్డు తెగిపోయి పలిమెల మండలానికి రాకపోకలు నిలిచిపోయి అయిదు రోజులవుతోంది.

* ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉట్నూర్‌ సహా పాత 30 ఏజెన్సీ మండలాల్లో రాకపోకలు స్తంభించాయి. పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పదుల సంఖ్యలో గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నిర్మల్‌, భైంసా, మంచిర్యాల పట్టణాలతో పాటు కడెం మండల కేంద్రాన్ని వరద ముంచెత్తింది. మంచిర్యాల - నిర్మల్‌ మార్గంలో ఖానాపూర్‌ సమీపంలో, ఆదిలాబాద్‌ - మంచిర్యాల మార్గంలో ఉట్నూర్‌ సమీపంలో ప్రధాన రహదారులు కోతకు గురై రవాణా స్తంభించింది.

ఉట్నూర్‌ మండల కేంద్రం జలమయమైంది. ఇంద్రవెల్లి మండలంలోని మిల్‌నగర్‌ బుద్ధనగర్‌ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. దస్నాపూర్‌ కల్వర్టు కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బేల మండలంలోని సాంగ్‌ గ్రామంలోకి పెన్‌గంగ వరద వచ్చింది. దేవునిగూడ, సాన్వి వంతెనలు కోతకు గురయ్యాయి. అప్రోచ్‌ రోడ్లు కొట్టుకుపోయాయి.

* నిర్మల్‌ జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కూలాయి. చాలాచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పత్తి 5,700 ఎకరాలు, సోయా 4,490 ఎకరాలు, మొక్కజొన్న 1800 ఎకరాలు,. ఇతర పంటలు 1000 ఎకరాల వరకు నీటమునిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.

* పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని రాజీవ్‌ రహదారిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముంపు కాలనీల వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. బుధవారం అర్ధరాత్రి ధర్మపురిలోని దేవస్థానం, శివాలయం వెనుక వీధుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. రాయికల్‌ మండలంలోని మూడు గ్రామాలు, బీర్పూర్‌ మండలంలోని ఒక గ్రామం జలదిగ్బంధంలోకి వెళ్లాయి. కోరుట్లలో వాననీటిలో చిక్కుకున్న సుమారు 25 కుటుంబాల ప్రజలను పొక్లెయిన్‌ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

* భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకూ వరద పెరుగుతుండటంతో తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భద్రాచలంలో అధికారులతో మరోసారి సమీక్ష చేశారు.

2,222 గ్రామాలకు ‘మిషన్‌ భగీరథ’ సరఫరాలో అంతరాయం:భారీ వర్షాల వల్ల ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్‌ జిల్లాల్లో 2,222 గ్రామాల్లో మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆయా గ్రామాలకు యుద్ధప్రాతిపదికన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తన నివాసంలో వరద పరిస్థితిపై బుధవారం సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details