పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 15 నాటికి పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఫలితంగా ఆగస్టు 13 - 17 తేదీల మధ్య ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.