పై నుంచి వస్తున్న వరదకు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు తోడవ్వటం వల్ల కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల నుంచి వరద ప్రవాహం కొనసాగటం వల్ల శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం 589.80 అడుగుల వద్ద ఉండటం వల్ల... వచ్చిన వరదను వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి లక్షా 29 వేల 716 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సాగర్ 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 89 వేల 838 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను... 1090.6 అడుగులు చేరుకుంది. 88.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 25 వేల 982 క్యూసెక్కుల వరద వస్తుండగా.. వరద కాలువ ద్వారా 17 వేల 493 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు.. తాడ్వాయి మండలంలోని సంగోజివాడి, కాళోజీవాడి గ్రామాల మధ్య వాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి.