Heavy Rains in Nagarkurnool: రెండు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు వాగులు మత్తడి పోతున్నాయి. పలు కాలనీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల ప్రభావంతో జిల్లాలోని తాడూరు దుందుభి వాగు, నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దుందుభివాగు శివారులోని.. గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రవాహ ఉధృతికి గుట్టలపల్లి-పోల్మురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుందుభివాగు ప్రవాహ ఉద్ధృతికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒకరు కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్న వారు రక్షించారు. అలాగే తాడు సహాయంతో ద్విచక్రవాహనాన్ని స్థానికులు బయటకు లాగారు. ఆ యువకుడిని కాపాడారు. దుందుభి వాగు ప్రవాహానికి తాడూరు మండలం నాగుదేవుపల్లిలో వైకుంఠధామం నిర్మాణాలు కుప్పకూలాయి. బిజినేపల్లి మండలం నల్లవాగు ఉద్ధృతికి వైకుంఠధామం నీట మునిగింది.