ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HEAVY RAINS IN HYDERABAD:హైదరాబాద్‌లో భారీ వర్షం.. డ్రైనేజీ గుంతలో పడి ఒకరు గల్లంతు

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం (heavy rains in hyderabad) కురిసింది. ఫలితంగా రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ట్రాఫిక్​ జామ్​తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. డ్రైనేజీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలో పడ్డాడు. సమాచారం అందుకున్న డీఆర్​ఎఫ్​ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.

HEAVY RAINS IN HYDERABAD
HEAVY RAINS IN HYDERABAD

By

Published : Sep 26, 2021, 8:19 AM IST

హైదరాబాద్‌లో వర్షం (heavy rains in hyderabad )దంచికొట్టింది. జోరువానకు రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. రహదారిపై ట్రాఫిక్‌ జామ్​ ఏర్పడి వాహనదారులు నానాపాట్లు పడ్డారు. మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజీ పైపు లైను కోసం తవ్విన గుంతలో పడి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.

గంటల తరబడి..

తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. ఏకధాటిగా వాన పడటంతో నాలాలు పొంగిపొర్లాయి. ఫలితంగా రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్​తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు గంటలతరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీలు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరుచేరింది. విద్యుత్‌కు అంతరాయం కలిగి.. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోఠిలో భారీ వృక్షం నెలకొరిగింది.
ఒకరు గల్లంతు..

మణికొండలో డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాలినడకన వెళ్తున్న అతడు... గుంత కనిపించకపోవటంతో ఒక్కసారిగా అందులో పడిపోయాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న జీహెచ్​ఎంసీ (GHMC), డీఆర్ఎఫ్​ (DRF) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి గల్లంతయ్యాడని స్థానికులు ఆరోపించారు. మూడు నెలల నుంచి పైపులైన్​ పనులు కొనసాగుతున్నా... హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అయితే... ఇందులో నిర్లక్ష్యం ఏమీ లేదని మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

మరో రెండు రోజులు..

జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 123.5 మిల్లీ మీటర్లు, రంగారెడ్డి జిల్లా మణికొండలో 105 మిల్లీమీటర్లు, షేక్‌పేట్‌లో 86, సంగారెడ్డిలో 85, సూర్యాపేటలో మునగాలలో 79.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో(rains in telangana) రాగల మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd weather report) వెల్లడించింది నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

HEAVY RAINS IN HYDERABAD:హైదరాబాద్‌లో భారీ వర్షం.. డ్రైనేజీ గుంతలో పడి ఒకరు గల్లంతు

ఇదీచూడండి:GULAB TUPAN: ఉత్తరాంధ్రకు గులాబ్ ముప్పు.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

ABOUT THE AUTHOR

...view details