గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. జోరువానల ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద, మురుగు నీరు రహదారులపైకి చేరి.. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల మోకాలిలోతు వరకూ వరద పోటెత్తింది.
వర్షాల కారణంగా ఎల్బీనగర్, మీర్‌పేట్ పరిధిలోని లోతట్టు కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. ఓవైపు నుంచి వరదనీరు.. మరో పక్క నుంచి మురుగు నీరు వీధుల్లోకి చేరడం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు. మీర్‌పేట్ పరిధిలోని సాయినగర్, శివసాయినగర్, శ్రీధర్‌నగర్ కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. ఎల్బీనగర్ పరిధిలోని గాంధీనగర్, విజయపురి కాలనీ, అయ్యప్ప నగర్, వెంకటేశ్వరకాలనీ, అంబేడ్కర్‌నగర్, భగత్‌సింగ్ కాలనీల్లోని రోడ్లపై ఇంకా వరద నీరు నిలిచి ఉంది.
ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్‌తో పాటు... ఘట్‌కేసర్, బోడుప్పల్, పిర్జాదీగూడ, పోచారం ప్రాంతాల్లోని కాలనీవాసుల బాధలు వర్ణనాతీతం. ఇక్కడ ఏర్పడిన కొత్త కాలనీల్లోకి మురికి నీరు వచ్చి చేరుతోంది. సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో.. నీరు అలాగే నిల్వ ఉంటుంది. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నిలిచి ఉండడం వల్ల గుంతలు ఏర్పడి రోడ్లు దెబ్బతిన్నాయి. బేగంపేటలోని రసూల్‌పుర, బోయిన్‌పల్లి, చిలకలగూడ, వారసిగూడ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు నిండుతుండడంతో సమీపంలోని ఉమామహేశ్వరకాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు ఎగువన ఉన్న ఈ కాలనీవాసులు... రెండు నెలలపాటు ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రెండు వీధుల్లోకి నడుములోతున నీరు వచ్చిచేరింది. ఫలితంగా స్థానికులు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.