అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. తలుపుల మండలంలో 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. తలుపుల మండలం చిన్నపల్లి, మాడికవాండ్లపల్లి చెరువు కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రమైన తలుపులలోని పలు కాలనీలు నీట మునిగాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
కొట్టుకుపోయిన కారు..
తలుపుల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి చిన్న పల్లి కదిరి పులివెందుల ప్రధాన రహదారి ఒదులపల్లి వద్ద వరద నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మృతి చెందారు. మృతుడు కదిరి పట్టణ మూర్తి పల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా కుమారుడిగా గుర్తించారు. ప్రమాదంలో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో కదిరి పులివెందుల మధ్య రాకపోకలు స్తంభించాయి.
కడప జిల్లాలో..
కడప జిల్లా పులివెందుల మండలం మొట్నూతల పల్లె గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓడలపల్లె వద్ద ఆర్డీపీ చెరువు తెగిపోవడంతో చెరువులో ఉన్న నీరంతా పులివెందుల కదిరి మార్గంలోని ని నామాలగుండు మీదుగా పులివెందుల మండలం మొట్నూతల పల్లి గ్రామానికి చేరింది. దీంతో కణం పల్లె గ్రామాల్లోని వందల ఎకరాల్లో అరటి, చీనీ, కూరగాయల పంటలు నీటిపాలైంది. దీంతో తమను ఆదుకోవాలని కనం పల్లె, మొట్నూతల పల్లె గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొట్నూతల పల్లె గ్రామంలో దాదాపు 20 పశువులు నీటి ఉద్ధృతికి బలై పోయాయని, కోళ్లు, మూడు ఎద్దుల బండ్లు, మూడు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో ...
విజయవాడ వన్ టౌన్ చిట్టీనగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండిపోయి ప్రధాన రోడ్లపైకి వదర నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో అరగంట పాటు వాహనచోదకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగిపొర్లుతుంది. దీంతో చెవిటికల్లు - కంచికచర్ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చందర్లపాడు మండలం పాటెంపాడు సమీపంలోని గుర్రాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నందిగామ నియోజక వర్గంలో రాత్రి భారీ వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.