తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులవరకు ఎండలో అల్లాడిన జనం.. ప్రస్తుతం వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని ఈ ప్రభావంతో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండ్రోజుల వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.
కర్నూలులో...
అల్పపీడన ప్రభావంతో కర్నూలులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో 2 రోజులుగా ఒక మోస్తరు వర్షం కురుస్తున్న కారణంగా.. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలకరి వర్షాల రాకతో.. సాగుకు సమాయత్తమవుతున్నారు. నంద్యాలలోనూ భారీ వర్షం కురిసింది. ఇన్నాళ్లు ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు వర్షాలతో ఉపశమనం పొందారు.
చిత్తూరులో..
చిత్తూరు జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. జల్లులతో కొండపై పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారాయి. సుదీర్ఘ విరామం తర్వాత స్వామిని దర్శించేందుకు వచ్చిన యాత్రికులు వర్షంలో తడుస్తూనే శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు.