ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం ప్రారంభమైన వర్షాలు ఆదివారం కూడా కొనసాగాయి. శనివారం వర్షం కురిసిన కొన్ని ప్రాంతాలు మరింతగా తడిసి ముద్దయ్యాయి. తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 గంటలనుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్య.. అనంతపురం జిల్లా కదిరిలో అత్యధికంగా 215 మి.మీ. వర్షపాతం నమోదైంది. దక్షిణ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, పరిసరాలపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ.నుంచి 4.5 కి.మీ.ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి ఆదివారం ఉత్తర తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, పొరుగు ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 1.5 కి.మీ.ఎత్తుకు చేరింది.
ఇది రెండు రోజులుగా కోస్తాపైనే కేంద్రీకృతమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా గుడిపల్లె, పూతలపట్టు, ములకలచెరువు, రామకుప్పం, చౌడేపల్లి, కొలమసనపల్లె, మదనపల్లె, సోమల, రాయనపేట, అనంతపురం జిల్లా లేపాక్షి, గంజివారిపల్లె, ఆమడగూరు, నల్లచెరువు, ఎన్‌పీకుంట, గాండ్లపెంట, సెట్టూరు, కడప జిల్లాలోని కడప నగరంతో పాటు చక్రాయపేట, కొండకమర్ల, పెద్దపల్లి, కర్నూలు జిల్లా కంబాలపాడు, ప్రకాశం జిల్లా ఒంగోలు తదితర ప్రాంతాల్లో 60 మి.మీ.నుంచి 96 మి.మీ.మేర వర్షం కురిసింది. గుంటూరు, కడప నగరాలు, కదిరి పట్టణం జలసంద్రమయ్యాయి.