Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా - కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. మరోవైపు రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ మరో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని తెలిసింది.
వీటి ప్రభావంతో జమ్మూ కశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు వివరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.