తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులూ భారీ వానలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి జోరుగా కురుస్తున్న వానలతో జనజీవనం అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వైరా, సత్తుపల్లి పరిధిలోని గ్రామాల్లో కుండపోత వానతో.. పలు ఇళ్లు కూలిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వస్తువులను కాపాడుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
ఆ చీరలు నీటిపాలు..
తల్లాడ మండలం కుర్నవల్లి ఉన్నత పాఠశాల జలమయమైంది. పాఠశాలలో నిల్వ చేసిన బతకమ్మ చీరలు, రేషన్ బియ్యం నీటి పాలయ్యాయి. తల్లాడలో ఇళ్లు కూలిన ఘటనలో 20 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం..
ముల్కలపల్లి మండలం పొగుళ్లపల్లి వద్ద వాగు ఉద్ధృతికి ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. వాగులో కొట్టుకుతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. ముల్కలపల్లి మండలం నరసాపురం, తోగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. కిష్టారం గనుల్లో 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
రోగులు అవస్థలు..
మధిర పట్టణంలో కుండపోత వర్షానికి ఇళ్లలోకి వరదనీరు చేరింది. మధిర ప్రభుత్వ ఆస్పత్రిలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. ప్రసూతి వార్డులోకి సైతం పెద్ద ఎత్తున నీరు చేరగా.. బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనంలో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.