తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దెబ్బతిన్న పంటలకు సంబంధించి వ్యవసాయశాఖ బృందాలు లెక్కలు తీస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో సుమారు 4,500 ఎకరాల్లో అరటి, బొప్పాయి, మిరప, టమోటా, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మంగళవారం గరిష్ఠంగా.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 15.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 14.5, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 11.6, కృష్ణా జిల్లా పెడనలో 9.8 సెం.మీ వర్షం కురిసింది. అనంతపురం, విజయనగరం, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వానలు కురిశాయి.
వర్ష సూచన...
మరో పక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో.. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి శ్రీకాంత్ తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని సూచించారు.
కొండవీటి వాగు పరిధిలో పంట మునక
గుంటూరు జిల్లాలో కొండవీటి వాగుకు మంగళవారం తెల్లవారుజామున తాడికొండ-కంతేరు గ్రామాల మధ్య గండిపడింది. సుమారు వెయ్యి ఎకరాల్లోని మిర్చి, పత్తి, వరి, మినుము, పెసర, తదితర పంటలు మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలి లోతున నీరు ప్రవహించడంతో గండిని పూడ్చడానికి రైతులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని 25 మండలాల్లో 130 గ్రామాల్లో 7,910 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వర్షాలకు కాకినాడలో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, జీజీహెచ్‌లోకి నీరు చేరింది. జీజీహెచ్‌లోని ఓపీకి వచ్చిన బాలింతలు, గర్భిణులు నీటిలోనే అవస్థలు పడుతూ చికిత్స పొందారు. వార్డులో మంచాల కిందకు నీరు చేరడంతో తమ శిశువులతో బాలింతలు, వారితో వచ్చిన బంధువులతో కిక్కిరిసిపోయింది.