Rains in telangana: తెలంగాణలోని పలుజిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరం తడిసి ముద్దయ్యింది. చంద్రకాంతయ్య కూడలి వద్ద రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశ్‌పల్లిలోని కొత్త కుంటకు గండి పడింది. డిచ్‌పల్లి మండలం ఘనపూర్, బర్దిపూర్, అమృతాపూర్, చెరువులు అలుగు పారుతున్నాయి. పడకల్ చెరువు నిండుకుండను తలపిస్తోంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండ్రోజుల నుంచి వాన కురుస్తుండడంతో.. పురాతన భవనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. పట్టణంలోని ఇందిరాప్రియదర్శిని కాలనీలోని ఓ ఇల్లు వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇల్లు కూలే సమయంలో కుటుంబసభ్యులు .. ఒక్కసారిగా బయటకి పరుగులు తీయడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిస్థాయిలో జలమయం కావడంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కూడవెల్లి వాగు నిండి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది.
'లోతట్టు' ప్రజల అవస్థలు..: హైదరాబాద్ శివారులో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉప్పల్, రామంతపూర్, చిలుకానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు వృక్షాలు నేలకూలాయి. వరంగల్ జాతీయ రహదారి జోడిమెట్ల, అవుషాపూర్ వద్ద వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.