తెలంగాణలోని భాగ్యనగరాన్ని వరుణుడు.. వణికిస్తూనే ఉన్నాడు. బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ జోన్లలో భారీ వర్షం కురిసింది. బొరబండ పరిధిలోని కాలనీల్లో వరద పోటెత్తింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు.
ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎల్లారెడ్డిగూడ రోడ్డు జంక్షన్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. బేగంపేట్‌లో నీరు రోడ్లపై నిలవడంతో అర్థరాత్రి వరకూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్.ఆర్.నగర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సుమారు 2 గంటల నుంచి 4 గంటల వరకు కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.