హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ కారణంగా నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్‌బీనగర్, చింతలకుంట, దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. వనస్థలిపురం, కిస్మత్‌పూర్, అత్తాపూర్, రాజేంద్రనగర్, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్‌పేట, లక్డీకాపూల్, మెహిదీపట్నం, చాదర్‌ఘాట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయ్యాయి. వాహనాల రాకపోకల అంతరాయం ఏర్పడుతుండటంతో... వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు, వీధుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నగర శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, అబ్ధుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్, మీర్‌పేట్, పీర్జాదీగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, షేక్‌పేట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.