కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. పులిచింతలకు 6 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరగా.. అధికారులు కిందకు వదులుతున్నారు. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చిన మేరకు.. ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి చేరగా.. అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం కృష్ణ నది ఒడ్డున నివాసం ఉంటున్న పల్లెకారులను, రైతు కూలీలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రాత్రికి వరద ఉద్ధృతి 8 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజి కి మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లి మహానాడులోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరద నీరు వస్తుందని ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.