ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ద్రోణి...దక్షిణ కోస్తాకు వర్ష సూచన - bay of bengal news

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rain forecast for AP
బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ద్రోణి

By

Published : Nov 13, 2020, 5:59 PM IST

దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కామోరిన్ ప్రాంతంలోనూ ఉపరితల ద్రోణి ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలోని చిత్తూరు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. 16, 17 తేదీల వరకూ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

మరోవైపు పశ్చిమ గాలుల కారణంగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు దిగి వచ్చినట్టు ఐఎండీ వెల్లడించింది. మధ్య భారత్​లో 4 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు ఐఎండీ తెలియజేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ క్రమంగా శీతల వాతావరణం మొదలవుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. రాజస్థాన్​తో పాటు కోస్తాంధ్ర జిల్లాలు, యానాంలో 1.6 నుంచి 3 డిగ్రీల వరకూ సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గాయని ఐఎండీ స్పష్టం చేసింది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. విశాఖలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా రికార్డు అయ్యింది. తిరుపతిలో గరిష్టం 31 కనిష్టం 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజమహేంద్రవరంలో గరిష్టం 31, కనిష్టం 21 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇక అనంతపురంలో 32, కనిష్టం 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details