ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదారి గట్టు కంగారు పెడుతోంది!

ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి కరకట్టలు చాలాచోట్ల భయపెడుతున్నాయి. వీటి పటిష్ఠానికి నిధులిచ్చి గట్టు పటిష్ఠం చేయాల్సి ఉన్నా.. మూడేళ్లుగా సరైన చర్యలు తీసుకోలేదు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరో రెండు, మూడు రోజుల పాటు గోదావరి వరద ప్రవాహాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. పోలవరం స్పిల్‌ వే నిర్మాణం తర్వాత 2020 ఆగస్టులో అత్యధికంగా 22,85,000 క్యూసెక్కుల వరద వచ్చింది.

heavy floods to godavari
గోదారి గట్టు కంగారు పెడుతోంది

By

Published : Jul 14, 2022, 7:16 AM IST

ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి కరకట్టలు చాలాచోట్ల భయపెడుతున్నాయి. వీటి పటిష్ఠానికి నిధులిచ్చి గట్టు పటిష్ఠం చేయాల్సి ఉన్నా.. మూడేళ్లుగా సరైన చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం చాలా ఏళ్ల తర్వాత జులైలోనే గోదావరికి భారీ వరద వస్తోంది. గురు, శుక్రవారాల్లో కాటన్‌ బ్యారేజికి 21 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా. గతంలో భద్రాచలం వద్ద వరద హెచ్చరికలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల ఆధారంగా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద ఎప్పటికి ఎంతస్థాయి వరద రానుందో అంచనా వేసి నియంత్రించటం సులభమయ్యేది.

ప్రస్తుతం పోలవరం వద్ద ఎగువ కాఫర్‌ డ్యాం 42 మీటర్ల ఎత్తులో నిర్మించారు. స్పిల్‌ వే నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు వదిలేసినా అక్కడ క్రెస్ట్‌ స్థాయి 28.52 మీటర్ల స్థాయిలో ఉంది. పోలవరం వద్ద గోదావరిలో 29 మీటర్ల ఎత్తులో అడ్డుకట్ట పడినట్లే లెక్క. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం ధవళేశ్వరం వద్ద అంచనాకు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలవరం వద్ద కొంతమేర వరదకు అడ్డుకట్ట పడుతోంది.

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరో రెండు, మూడు రోజుల పాటు గోదావరి వరద ప్రవాహాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. పోలవరం స్పిల్‌ వే నిర్మాణం తర్వాత 2020 ఆగస్టులో అత్యధికంగా 22,85,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రస్తుతం జులైలో దాదాపు అదే స్థాయి లేదా, అంతకుమించి వరద రావచ్చని అంచనా. రాజమహేంద్రవరం తర్వాత అఖండ గోదావరి ఏడు పాయలుగా చీలిపోయింది.

30 చోట్ల మరీ బలహీనం..గోదావరి గట్టు 30 చోట్ల బలహీనంగా ఉందని నది కన్జర్వేటర్‌ గతంలోనే ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. వాళ్లు గతేడాది జనవరిలోనే ఉభయగోదావరి జిల్లాల్లో తిరిగి నివేదిక సమర్పించారు. ఇప్పటికీ దీనిపై చర్యలేమీ తీసుకోలేదు. గట్ల పటిష్ఠానికి రూ.600 కోట్లతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ ఆ పనులకు పాలనామోదం దక్కలేదు.

మరోవైపు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్సు కింద కొన్ని లక్షల రూపాయలతో తాత్కాలిక పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటికి అనుమతులు వచ్చి టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకురాలేదు. పాత బిల్లులు పెండింగులో ఉండటంతో తాము పనులు చేయలేమన్నారు. ఫలితంగా ఇప్పుడు వస్తున్న వరద గోదావరి గట్టును కంగారుపెడుతోంది.

2020 వరదల్లోనే భయం..2020లో గోదావరికి గరిష్ఠంగా 22,85,000 క్యూసెక్కుల ప్రవాహాలు వచ్చాయి. ఆ సమయంలో 15చోట్ల నీటి లీకేజీలతో గట్టు తెగుతుందేమోనన్న ఆందోళనతో అధికారులు పరుగులు పెట్టారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి నది ప్రవహించింది. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటితే దాదాపు 105 చోట్ల గోదావరి కరకట్టలపై పర్యవేక్షణ అవసరమని గుర్తించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details