ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండి.. జురాల వైపు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 38,200 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1,038 అడుగుల వద్ద ఉంది. వరద ప్రవాహం పెరగడం వల్ల అధికారులు అప్రమత్తమవుతున్నారు.
జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.17 టీఎంసీలుగా ఉంది. కర్ణాటక ప్రాంతంలో ఉన్న అలమట్టి ప్రాజెక్టు నుంటి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా నారాయణపూర్ జలాశయం మీదుగా జూరాలకు చేరుతోంది.