Electricity bills for schools in AP: రాష్ట్రంలోని మారుతున్నాయి. పాఠశాలల నిర్వహణకు కేటాయిస్తున్న నిధులు వీటికే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో చాక్‌పీసులు, రిజిస్టర్లు, సాంస్కృతిక కార్యక్రమాల వ్యయాలను ఉపాధ్యాయులు సొంతంగా భరించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు-నేడు’ కింద 15,715 బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఫ్యాన్లు, లైట్లు, వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయి. బిల్లులను ముందుగా ప్రధానోపాధ్యాయులు చెల్లిస్తున్నా ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కావడంలేదు.
ఏడాదికి రూ.60 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 44,639 పాఠశాలలు ఉండగా.. వీటికి ఏడాదికి రూ.60కోట్లకుపైగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ బిల్లులకు గ్రాంటు లేనందున ఉచితంగా అందించాలని ఎప్పటి నుంచో ఉపాధ్యాయులు కోరుతున్నారు. కేటగిరి-2లో ఉండడంతో విద్యుత్తు ఛార్జీలు అధికంగా ఉంటున్నాయి. సమగ్ర శిక్ష అభియాన్ నిర్వహణ గ్రాంటును విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తోంది. 30 మందిలోపు ఉంటే ఏటా రూ.10వేలు మాత్రమే ఇస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు చెల్లించిన బిల్లుల బకాయిలు ఇంతవరకు విడుదల కాలేదు.
- కడప జిల్లా బద్వేలు జిల్లా పరిషత్తు పాఠశాలకు విద్యుత్తు బిల్లు నెలకు రూ.10 వేలు వస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్ మాత్రం రిజిస్టర్లు, చాక్‌పీస్‌లు, ఇతరాత్ర నిర్వహణ అన్నింటికీ కలిపి ఏటా రూ.లక్ష మాత్రమే ఇస్తోంది.
- నెల్లూరు జిల్లా నాయుడుపేట జిల్లా పరిషత్తు పాఠశాలకు నెలకు రూ.3,900 విద్యుత్తు బిల్లు వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ గ్రాంటులో సగానికిపైగా విద్యుత్తు బిల్లులకే వెళ్లిపోతోంది.
- నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని నిడిముసలి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యుత్తు బిల్లుల కింద రూ.23వేలు సొంత డబ్బులు చెల్లించారు. దగదర్తి ఉన్నత పాఠశాలలో రూ.17వేలు ఖర్చు చేయగా.. ఇంతవరకు బిల్లులు విడుదల కాలేదు. బిల్లులు సమర్పించినా చెల్లింపులుకావడం లేదని ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు.