గుంటూరు జిల్లాలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ఐదు మండలాల పరిధిలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. బ్యారేజి నుంచి 8లక్షల క్యూసెక్కులకు పైగానే మేర వరద దిగువకు వదులుతున్నారు. ఫలితంగా తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపొర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో.. వేలాది ఎకరాల పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. చాలా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటకు రావాలంటే వరద. ఊళ్లో ఉండాలంటే బురద అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి. వరద తీవ్రతకు పంట పొలాలన్నీ మునిగిపోయాయి. ముంపుతో అష్టకష్టాలు పడుతోన్నా అధికారులు కనీసం తమవైపే చూడటం లేదని వరద ఎంత మొత్తంలో వస్తుందో కనీస సమాచారం కూడా చెప్పడం లేదని లంక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇళ్ల చుట్టూ నీరు చేరి ఉండటానికి వీల్లేని పరిస్థితుల్లో.. కొందరు దగ్గరలో ఉన్న తమ బంధువుల ఇంటికి కాలినడకన పయనమయ్యారు. అధికారులు వచ్చే సహాయం అందించే సరికి నిండా మునుగుతామంటున్న మరికొందరు ట్రాక్టర్లతో నిత్యావసరాలను తెచ్చుకుంటున్నారు.ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని..గతేడాదిలా కాకుండా, త్వరితగతిన నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకుని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.