రాష్ట్రంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రచండమైన వేడిని ప్రసరింపచేస్తూ ‘ఇవేం ఎండలురా బాబూ’ అంటూ ప్రజలు ఆపసోపాలు పడేలా చేస్తున్నాడు. ఈ భగభగలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ఠంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయని.. 29వ తేదీ నుంచి పిడుగుల మోత, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణాలను ఆదివారం ఆమె ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు వివరించారు.
పెరుగుతున్న తేమ శాతం
‘‘అంపన్ తుపాను తీరం దాటిన తర్వాత.. ఈ నెల 21న విజయవాడలో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత(వాతావరణశాఖ లెక్కల ప్రకారం) నమోదైంది. వాతావరణంలో తేమ 9 శాతానికి పడిపోయింది. దీంతో పొడి వాతావరణం ఏర్పడి దేశంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత క్రమంగా తేమశాతం పెరుగుతోంది. ప్రస్తుతం 30 శాతం వరకు ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గాయి.
తేమ, ఉష్ణోగ్రతలు పెరిగితే చెమటలే
వాతావరణలో తేమ శాతం పెరగడంతోపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైతే అసౌకర్య(డిస్‌కంఫర్ట్ ఇండెక్స్) పరిస్థితి నెలకొంటుంది. ఉదాహరణకు విజయవాడలో తేమశాతం 9 శాతానికి పడిపోయిన రోజు.. చెన్నైలో 70 శాతం నుంచి 90 శాతం ఉంది. అదే సమయంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. దీంతో తీవ్ర ఉక్కపోత పరిస్థితులు ఉంటాయి. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. నిర్జలీకరణ(డీహైడ్రేషన్)కు గురై శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా నీరు తాగడం, ఉప్పు కలిపిన మజ్జిగ, లస్సీ, ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవాలి.