జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎక్కడ నిలిచిపోయాయో.. అక్కడి నుంచి ప్రారంభించేలా ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ... గుంటూరు జిల్లా పాలపాడు గ్రామానికి చెందిన ఎం.రామిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై శనివారం జరిగిన విచారణలో ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పత్రికల్లో వచ్చిక కథనాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఎస్ఈసీ రాజ్యాంగ విధిని నిర్వహించడం లేదనేది అవాస్తవమని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ అంశం పరిశీలనలో ఉందని కోర్టుకు వివరించారు.
ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోకముందే కోర్టును ఆశ్రయించడం సరికాదని... నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయడం కోసం ఈ వ్యాజ్యం వేశారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఎస్ఈసీ స్వతంత్రతకు నష్టం కలుగుతుందన్న న్యాయవాది... నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఏవిధంగా ప్రశ్నిస్తారన్నారు.
ఎన్నికల విషయంలో ఎస్ఈసీ అభిప్రాయాల్ని పేపర్‌పై ఉంచలేం. ప్రజాబాహుళ్యంలో పెట్టలేం. ఎన్నికల కమిషనర్.. గవర్నర్‌కు రాసిన లేఖను ఆధారంగా చేసుకొని ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గవర్నర్‌కు కమిషనర్‌కు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మూడు నెలలుగా లీక్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో వ్యాజ్యం వేశాం. ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేయడం ఎస్ఈసీ స్వతంత్ర వ్యవహారం. వ్యాజ్యంలో జోక్యం చేసుకోవద్దు.-ఎస్ఈసీ తరఫు న్యాయవాది