జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య.. విచారణను జాప్యం చేసేందుకే తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. కోర్టు సమయాన్ని బీపీ ఆచార్య వృథా చేస్తున్నారని వాదించింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనపై అభియోగాలు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ బీపీ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ప్రభుత్వ అనుమతి లేదనడం సరికాదు..
అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. సీబీఐ కోర్టు అభియోగాలను స్వీకరించిందని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదించారు. ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినందున.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదనడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అరబిందో, హెటిరో ఛార్జ్ షీట్లోనూ బీపీ ఆచార్య పిటిషన్ కు ఇదే వాదన వర్తిస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.