HC Hearing on Chintamani Drama: చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ వ్యాజ్యాల్లో తమను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ.. ఆర్యవైశ్యుల తరపున బహుళ అనుబంధ పిటిషన్లు వేయడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అనుమతించుకుంటూ పోతే ప్రధాన వ్యాజ్యంపై విచారణ కొనసాగించే పరిస్థితి ఉండదని పేర్కొంది. అంతిమంగా శ్రీకాళి అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమ, నిత్యాన్న సత్రం వేసిన అనుబంధ పిటిషన్‌ను మాత్రమే అనుమతించింది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సమాజంలోని ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచేలా జీవనోపాధి ఉండకూడదని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం నిషేధం
చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ స్పందిస్తూ.. ఆర్యవైశ్యుల తరపున అనుబంద పిటిషన్ వేశామన్నారు. ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. తమ వినతి మేరకు ప్రభుత్వం నాటకాన్ని నిషేధించిందన్నారు. నాటకంలోని ఓ పాత్ర ఆర్యవైశ్యుల సామాజిక వర్గాన్ని సూచిస్తూ .. వేశ్యాగృహాలకు వెళ్లే వాడిగా చిత్రీకరిస్తున్నారన్నారు.
ఇలా అయితే వందల ఇంప్లీడ్
న్యాయవాదులు ఈవీవీఎస్ రవికుమార్, వి.సాయికుమార్ స్పందిస్తూ .. ఆర్యవైశ్యుల తరపున తాము నేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేసి ప్రతివాదులుగా చేర్చాలని కోరామన్నారు. ఈ క్రమంలో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలా అనుమతించుకుంటూ పోతే వందల సంఖ్యలో ఇంప్లీడ్ కోసం పిటిషన్లు దాఖలవుతాయని వ్యాఖ్యానించింది. ఇప్పటికే వేసినవాటిని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. కనీసం మొదట తాము వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని సీనియర్ న్యాయవాది కోరడంతో అందుకు ధర్మాసనం అంగీకరించింది. మిగిలిన వాటిని న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు.