ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2021, 12:08 PM IST

ETV Bharat / city

అమ్మలూ... ఇవే మీ ఆయుధాలు

కరోనాని జయించాలంటే... ముఖ్యంగా రెండు ఆయుధాలు కావాలి. ఒకటి... ఆహారం. రెండు మనోధైర్యం. ఆహారంతో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. దానికి శారీరక వ్యాయామాలు తోడవ్వాలి అంటారు పోషకాహార నిపుణురాలు జాస్తి శ్రీదేవి.

కరోనా సమయంలో తీసుకోవాల్సిన ఆహారం
కరోనా సమయంలో తీసుకోవాల్సిన ఆహారం

రోనా గురించి ఆందోళన పడేకంటే... ఆరోగ్యాన్ని ఎలా భద్రంగా ఉంచుకోవాలని ఆలోచించడమే ప్రస్తుతం అవసరం. కరోనానే కాదు... ఏ వ్యాధుల బారిన పడకూడదన్నా రోగనిరోధక వ్యవస్థ కీలకం. దాన్ని ప్రధానంగా మంచి ఆహారపుటలవాట్లతోనే మెరుగు పరుచుకోగలం. అలాగని ఒక్కసారిగా డైట్‌లో విపరీతమైన మార్పులు చేస్తే శరీరం ఒత్తిడికి గురయ్యే అవకాశమూ ఉంది. మొదటి నుంచీ అలవాటున్నవీ, మన శరీరతత్వానికి పడేవాటి నుంచే అన్నిరకాల పోషకాలూ అందేలా చూసుకోవాలి.

సమతులాహారం తీసుకోవాలి...

ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, గుడ్లు, ఎండుఫలాలు వంటి పదార్థాలన్నీ మిళితమైన సమతులాహారం ప్రతి ఒక్కరి రోజువారీ ఆహార ప్రణాళికలో భాగం కావాలి. వ్యాధి నిరోధక శక్తి బలపడాలంటే... ప్రొటీన్‌ అవసరమే. అలాగని గుడ్లు, మాంసాహారాల్ని మితిమీరి తినకూడదు. అలాచేస్తే జీర్ణవ్యవస్థ పనితీరుపై భారం పడుతుంది. పప్పుధాన్యాలు, రాజ్మా, సెనగలు, సోయా వంటి మొక్కల ఆధారిత ఆహారధాన్యాల నుంచి కూడా ప్రొటీన్‌ అందుతుంది. వాటిని కూడా తీసుకోవచ్చు.

మెనూ ఎలా ఉండాలి...

కరోనాని ఢీకొట్టాలంటే... ఖరీదైన ఆహారం తినేయాలనే అపోహలు వద్దు. అందుబాటులో ఉండే పదార్థాలతోనే శరీరానికి మంచి పోషకాలు అందేలా చూసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే టీ కాఫీలకు బదులుగా అల్లం, పసుపు కొమ్ము, జీలకర్ర, మిరియాలు, కాస్త ధనియాలు, కొన్ని వాముగింజలు/వామాకుని లీటరు నీటిలో వేసి మరిగించి తాగండి. ఇది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడమే కాదు, వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది.

తేలిగ్గా అరిగేలా...

ఉదయాన్నే టిఫిన్‌కి పూరీలు, దోసెలు, బోండాలు వంటివి కాకుండా... ఇడ్లీ, ఆవిరి కుడుము వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. దీనికి జతగా కప్పు కొబ్బరి చట్నీ తినండి. దాన్ని చేసేటప్పుడు గుప్పెడు నానబెట్టిన బాదం గింజల్ని కూడా వేసుకుంటే మహిళలకు రోజువారీ శరీర అవసరాలకు కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ఇక ఏ వంట చేసినా... కొత్తిమీర, కరివేపాకు,పుదీనా, పచ్చిమిర్చి వంటివి వినియోగించండి. ఆకుకూరలు, పాలు-పెరుగు, క్యారెట్లు, చిలగడదుంపలు, క్యాప్సికం, గుడ్లు, బొప్పాయి, మామిడి, స్ట్రాబెర్రీ, ఉసిరి, జామ, నిమ్మ, నారింజ వంటివీ తీసుకోవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు... ముఖ్యంగా విటమిన్‌ ఎ, సి ఇ వంటివి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి. అయితే విటమిన్‌ సి ని శరీరం ఉత్పత్తి చేసుకోలేదు. నిల్వ చేసుకోలేదు. కాబట్టి... రోజువారీ ఆహారంలో ఇది తప్పక భాగం కావాలి. ముఖ్యంగా ఐరన్‌ని శరీరం గ్రహించాలంటే... ఆహారం తీసుకున్నాక ఓ పండు తినాలన్న నియమం పెట్టుకోవడం అవసరం. అలానే రోగనిరోధకశక్తిని బలోపేతం చేయడానికి విటమిన్‌ బి12 కూడా కీలకమే.

విటమిన్‌ డి...

ఇది ఆహార పదార్థాల నుంచి తగినంతగా దొరకదు. సూర్యరశ్మి నుంచి మన శరీరమే స్వయంగా తయారు చేసుకోవాలి. రోజుకి 600 ఐయూ అవసరం అవుతుంది. చాలా కొద్ది మోతాదులో గుడ్డులోని పచ్చసొన, జంతుకాలేయంలో లభిస్తుంది. అందుకే ఎండపొడ తప్పనిసరిగా పడేలా చూసుకోవాలి. కాపర్‌ జింక్‌, ఐరన్‌, సెలీనియం వంటి ఖనిజాలు... ఎండు ఫలాలు ద్వారా అందుతాయి. అలానే నువ్వులు, అవిసెలు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు వంటివాటిని పొడిగా చేసుకుని కూరల్లో చల్లుకుంటే సరి. అవసరమైన పోషకాలన్నీ ఒంటికి పడతాయి. పనిగట్టుకుని వండి తినాలనే బాధా ఉండదు. కీరా, టొమాటో, క్యారెట్‌ వంటివి ముక్కలుగా తరిగి, కాస్త మిరియాల పొడి, గుమ్మడి గింజల పౌడర్‌ వంటివి చల్లుకుంటే కావాల్సిన న్యూట్రియంట్లు పుష్కలంగా అందుతాయి. వీటన్నింటితో పాటు కాలానుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు తీసుకోవడం, తగినన్ని నీళ్లు తాగడమూ ముఖ్యమే. అంతేకాదు... తీసుకున్న ఆహారానికి తగ్గట్లు రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి.

ఇవి చేయొద్దు...

శరీరానికి అవసరమైన పోషకాల కోసం ఫుడ్‌ సప్లిమెంట్లను ఆశ్రయించొద్దు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోండి. ఇవి వేయించిన పదార్థాలు, శీతలపానీయాలు, రిఫైన్డ్‌ ఫుడ్‌, చక్కెర వంటివి వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఏ మాత్రం ఉపయోగపడవు. వీటికి దూరంగా ఉండండి.

మానసికంగా ధైర్యంగా ఉంటూ, పౌష్టికాహారం, వ్యాయామాలతో కరోనాపై గెలిచిన వృద్ధ మహిళల అనుభవాలివీ...

వారం పాటు జరమొచ్చినా!

‘ఏం.. మాయదారి కరోనానో ఏమోగానీ నేను మాత్రం భయపడలేదు. వారం జ్వరంతో వణికిపోయినా.. అయినా అధైర్యపడలేదు’ అంటోంది 93 ఏళ్ల గొండ లక్ష్మీదేవక్క. జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామానికి చెందిన ఈ బామ్మ మన గుండె బలమే గొప్పదనీ... ఏమవుతుందోననే ఆందోళన వద్దని సూచిస్తోంది. వైద్యులు సూచించిన మందుల్ని వాడుతూనే... తాజా పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంది. గోరువెచ్చని నీళ్లను తాగుతూ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఇబ్బందిని అధిగమించింది.

అదరలె.. బెదరలేదు బిడ్డా..!

‘‘కరోనా మా ఊరోళ్లను ఆగమాగం జేసింది. ఒక్క మా ఊళ్లోనే వంద మందికిపైగా ఈ రోగమొచ్చిందని ఊరంతా జంకిండ్రు. సూస్తుండంగనే నాకు, మా ఇంటోళ్లకు కూడా కరోనా వచ్చిందని డాక్టర్లు జెప్పిండ్రు. ముసలి పాణం ఏమైతదోనని ఇరుగు పొరుగు జాలి సూపించిండ్రు. నేను మాత్రం అదరలేదు..బిడ్డా! మన భయమే సగం రోగం. గుండె నిబ్బరంతోని ఉన్న’.. అంటోంది 90 ఏళ్ల ఎడెళ్లి నర్సవ్వ. ఈమెది జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కటకపూర్‌. చిన్నప్పటి నుంచి శాకాహారి అయిన నర్సవ్వ తాజా పండ్లు కూరగాయల్ని తింటూ. వైద్యుల సూచనలతో క్రమం తప్పక మందుల్ని వేసుకునేది. వ్యాధి ఆలోచనలను మళ్లించేందుకు సమీపంలోని పొలానికి వెళ్లి పని చేయడం, కాసేపు నడక... వంటి పనుల్ని దినచర్యగా మలుచుకుంది. కరోనా కష్టాన్ని దాటేసింది.

మనసు దారి మళ్లించండి

మందుల కంటే మనోధైర్యమే గొప్పది. కొవిడ్‌ వచ్చిందనో, వస్తుందనో...భయపడటం వల్ల ఒత్తిడికి గురైతే మరణం అంచుల వరకూ వెళ్లే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి ఒత్తిడి మీకు ఉందంటే... దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం వెంటనే మొదలుపెట్టండి. వాటి మీద నుంచి మనసుని మీకిష్టమైన విషయాల మీదకు మళ్లించండి. సామాజిక దూరంతో తోటపని చేయండి. నాలుగ్గోడల మధ్య ఉండిపోతే... సన్నిహితులతో మాట్లాడేందుకు సమయం కేటాయించండి. పాటలు, పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ... ఇలా మీకిష్టమైన విషయాలతో సాధన చేయండి. ఇందుకు తగినంత నిద్ర కూడా అవసరం.

ఇదీ చూడండి:

అమలాపురంలో ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి

కేరళ కాంగ్రెస్​ (బి) ఛైర్మన్​ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details