ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలకు ఫీజులను పెంచుతున్నట్లు ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ‘సాధారణ సేవలకు రూ.3,250, తీవ్ర అనారోగ్యం పాలైన వారి నుంచి రూ.10,380 వసూలు చేసేలా ప్రభుత్వం గతంలో ధరలు నిర్ణయించింది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం పాలైనవారికి అందించే సేవలకు ఫీజు రూ.16వేలకు పెంచుతున్నాం. ఈ నిర్ణయంతో రోగులపై భారం పడదు. ప్రైవేటు ఆసుపత్రులు మరింత నాణ్యమైన వైద్య సేవలందించాలి. పేదల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి’ అని కోరారు. ఫీజుల పెంపుపై కమిటీని నియమించినట్లు తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కొవిడ్ పరీక్షా ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కొవిడ్ పరీక్షలను గత పది రోజుల్లో 30వేల నుంచి 80వేలకు పెంచామని తెలిపారు.
ఫోన్ వచ్చిన 3గంటల్లో పడక కేటాయింపు
104 కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, కాల్‌సెంటర్‌కు ఫోన్ వచ్చిన 3గంటల్లో పడక కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాని వివరించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఆసుపత్రుల్లో పడకలు కేటాయిస్తామన్నారు. తక్కువ స్థాయి లక్షణాలున్న వారికి కొవిడ్ కేర్ కేంద్రాల్లో వైద్యసేవలు అందించేలా చూడటంతో ఆసుపత్రుల్లో పడకల కొరత తలెత్తదని తెలిపారు. హోంఐసొలేషన్‌లో ఉండే బాధితుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రోగులకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా పైపుల మరమ్మతుకు రూ.30 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మార్చురీల్లో పనిచేసే ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలకు ఇచ్చే వేతనాన్ని రూ.13వేల నుంచి రూ.15వేలకు పెంచుతున్నామని, కొవిడ్ కాలానికి ఈ పెంపు వర్తిస్తుందని వివరించారు.