నకిలీ ధ్రువ పత్రాలతో కారు కోసం రూ.19 లక్షల రుణం తీసుకొని ఈఎంఐలు చెల్లించని హెల్త్ ఇన్స్పెక్టర్ అనూప్ దేవదాసన్ను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ మన్సూరాబాద్‌లోని హిమపురి కాలనీలో ఆయన నివాసముంటారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో హెల్త్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఆయన... 2018 లో హిమాయత్‌నగర్ ఎస్బీఐ శాఖలో రుణం తీసుకున్నారని పోలీసులు తెలిపారు. మూడు నెలలుగా ఈఎంఐలు చెల్లించలేదని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు చాలాసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని అన్నారు.
చివరికి ఆయన రుణం ఫైల్‌ను పరిశీలించగా... ధ్రువ పత్రాలన్నీ నకిలీవని తేలాయని చెప్పారు. 2019లో ఆ బ్యాంకు మేనేజర్ సీఎన్ఏవీఆర్కే శర్మ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎట్టకేలకు రెండేళ్లకు అనూప్ దేవదాసన్ చిక్కాడని వెల్లడించారు. జల్సా జీవితానికి అలవాటుపడిన ఆయన గుర్రపు పందెం, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వివరించారు.