దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. గతంలో ఆయన హస్తినలోనే కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. మరోసారి కన్నుతో పాటు, దంత పరీక్షలు చేయించుకోనున్నట్లు తెలిసింది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి.
వారం రోజులుగా కేసీఆర్ ఏం చేశారంటే..
ఈనెల 1న ప్రత్యేక విమానంలో హస్తిన వెళ్లిన తెలంగాణ సీఎం.. 2న వసంత విహార్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తెరాస కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడో తేదీన ప్రధాని మోదీతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ అయ్యారు. పది అంశాలపై వేర్వేరు లేఖలను అందించారు. వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐపీఎస్ క్యాడర్‌పై కేంద్రం సమీక్షించాలని, ఆ రాష్ట్రంలో సమీకృత టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు కేటాయింపు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విస్తరణ, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈనెల 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైన కేసీఆర్.. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపుతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చాలని అమిత్‌షాను ఆయన కోరారు. పాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించినట్లు తెలిపారు. ఫలితంగా కొత్త జోన్లు, మల్టీ జోన్లు ఏర్పడ్డాయని, అందుకు తగినట్లు పోలీసు శాఖలో మార్పులు చేసినట్లు తెలిపారు. 2016లో కేంద్ర హోంశాఖ ఐపీఎస్‌ల క్యాడర్‌పై సమీక్షించిందన్నారు. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత పోలీసు శాఖలో జరిగిన మార్పులతో అదనంగా 29 డ్యూటీ పోస్టుల్లో సీనియర్ అధికారుల అవసరం ఏర్పడిందని వివరించారు. అందువల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్యను 105కు పెంచాలని, ఐపీఎస్ కేడర్ పోస్టుల సంఖ్యను 139 నుంచి 195కు పెంచాలని కోరారు. కొత్త కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీల అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను ప్రత్యేక కేసుగా పరిగణించి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష నిర్వహించి అందుకు అనుగుణంగా అధికారుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై 5 లేఖలు అందించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లైన్లుగా విస్తరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి- హైదరాబాద్ రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని కోరారు. శ్రీశైలం రహదారిని విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని గడ్కరీతో సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1,138 కి.మీ రోడ్లను అభివృద్ధి పరచాలని.. రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కోరారు.