కరోనా వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ కొత్తగా ఎవరికీ కరోనా పాజిటివ్ కేసు నిర్ధరణ కాలేదని తెలియజేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన కారణంగా.. విదేశాల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాలేదని... ప్రస్తుతం ఉన్నవారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంటింటి రీసర్వే చేపట్టినట్టు తెలియజేసింది.
కేసుల వివరాలు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇందులో నెల్లూరులోని ఓ రోగికి చికిత్స అనంతరం రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని వెల్లడిచింది. ఇప్పటి వరకూ 270 కేసుల్లో నమూనాలు సేకరిస్తే 229 మందికి కరోనా లేనట్టు తేలిందని వివరించింది. ప్రస్తుతం మరో 33 మందికి సంబంధించిన నమూనాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ప్రకటించింది.