‘దొంగలు పడ్డ ఇల్లూ దోసకాయ తిన్న కడుపూ రెండూ ఒకటే’ అన్నది సామెత. దోసకాయ తింటే మలబద్ధకం ఉండదు అన్న అర్థంతో ఈ సామెత చెబుతారు. అది అక్షర సత్యం. రకమేదయినాగానీ దోసవల్ల జీర్ణశక్తి బాగుంటుందనీ, పొట్టలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుందనీ పోషక నిపుణులూ చెబుతున్నారు.అందుకేనేమో, వెనక టిబెరియస్ అనే రోమన్ చక్రవర్తికి ఆకాలం ఈకాలం అన్న తేడా లేకుండా రోజూ కీరా ఉండాల్సిందేనట. దాంతో అప్పట్లోనే కీరాని గ్రీన్‌హౌసుల్లో పండించే వారట. అంటే- ఆరోగ్యానికి అది చేసే మేలు ఎంతో అర్థమవట్లేదూ. పెరట్లోనూ పొలంగట్లమీదా ఎక్కడంటే అక్కడ పెరిగే దోసకాయలు ఈ తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చేమోగానీ ఒకప్పటి పిల్లల చిరుతిళ్లలో ఇవీ ఒకటి.
కీరా.. తినరా మైమరచి..!
‘యాజ్ కూల్ యాజ్ కుకుంబర్’ అనేది ఓ ఇంగ్లిష్ నానుడి. కోస్తే చల్లగా ఉండే కీరా తింటే ఒంటికీ చల్లదనాన్ని అందిస్తుంది మరి. ఎండల్లో తిరిగేటప్పుడు కీరాముక్కల్ని తిన్నా నీళ్లు తాగినా హాయిగా ఉంటుంది. అందుకే బౌద్ధ భిక్షువులు వేసవిలో చల్లగా ఉండాలని కోరుకుంటూ కీరాతో దీవిస్తారట. 95శాతం నీటితో ఉండే కీరా వల్ల వడదెబ్బ తగలదు. అయితే మనకు తెలిసిన కీరాలు ఒకటి రెండే కావచ్చు. కానీ పలుచని తొక్కతో ఉండి త్వరగా జీర్ణమయ్యే బర్‌ప్లెస్, చిన్న సైజులో గింజల్లేకుండా సువాసనతో ఉండే లెబనీస్, ముదురాకుపచ్చరంగులో పొడవుగా గరుకు తొక్కతో ఉండే ఈస్ట్ ఏషియన్, తియ్యని పర్షియన్, పసుపూ ఆకుపచ్చా కలగలిసిన రంగులో గుండ్రంగా కొంచెం తీపితో ఉండే ఆపిల్ కుకుంబర్, ముదురాకుపచ్చరంగులో మీడియం పరిమాణంలో ఉండే కీరా కుకుంబర్, పాముల్ని పోలిన పొడవాటి అర్మీనియన్, ముళ్ల తొక్కతో ఉండే జెర్కిన్, బంగాళాదుంపని పోలిన ఆలూ కుకుంబర్, కూరగాయగా వాడే దోసకాయ.. ఇలా కీరాలో రకాలనేకం. వీటిని నేరుగా తినడంతోపాటు ఇతర కూరగాయలతో కలిపి సలాడ్లూ జ్యూస్‌లూ రైతాలు చేసి తింటుంటారు. ఐరోపా, అమెరికా దేశాల్లో కీరా రకాలతోనే నిల్వ పచ్చళ్లూ పట్టుకుంటారు. అయితే ఏ కీరా అయినాగానీ పండితే చేదుగా పుల్లగా అయిపోతుంది. అందుకే వీటిని పచ్చిగా- అంటే, ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోసి తినాలి.
దోస, కీరా.. ఒకటేనా?!
నేరుగా తినే కీరాదోస.. కూరగాయగా వాడుకునే దోస.. రెండిటికీ రుచిలోనూ రూపంలోనూ తేడా కనిపిస్తుంది కానీ రెండిటిదీ దాదాపు ఒకటే జాతి. కానీ కీరా ప్రపంచవ్యాప్తంగా ఉంటే, దోసకాయ కేవలం మన దగ్గర మాత్రమే పండుతుంది. ఎందుకంటే- కీరా(కుకుంబర్), కర్బూజ(మెలన్)ల సంకరీకరణంతో పుట్టుకొచ్చినదే మనదైన కూర దోసకాయ. అందుకే ఇది పండినప్పుడు కర్పూజ రకాల్లానే మంచి వాసన వస్తుంది. పైగా దీని స్వస్థలం కూడా తెలుగు నేలే. అందుకే మన రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, శ్రీలంకల్లోనే ఎక్కువగా పండిస్తారు, తింటుంటారు. దోసకాయని పప్పుగా వండినా; దప్పళంలో, సాంబారుల్లో వేసినా; చేపలకూరతో కలిపి వండినా ఆ వంటకానికే రుచి వస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక, రోటిపచ్చడి చేసినా ఆవపిండి జోడించి నిల్వ పచ్చడి పట్టినా ఆహా అనని వాళ్లుండరు. దీన్ని వంటల్లోనే కాదు, పచ్చిగా తిన్నా మంచిదేనట. పొట్టలో చెడు పేరుకోకుండా చూసే పీచూ, రోగనిరోధకశక్తిని పెంచే సి-విటమిన్, ఎముకల వృద్ధికి తోడ్పడే కె-విటమిన్, పొటాషియం, మెగ్నీషియం.. వంటివన్నీ సమృద్ధిగా ఉంటాయి. దీన్లో కూడా పిందెల్ని తలపించేలా చిన్నసైజు రకాలైన బుడం, నక్క దోస; కోలాకారంలో ఉండే మద్రాసు దోస.. వంటివీ ఉన్నాయి.