HC On Uddanam Kidney Problems: ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు, రాజ్యాంగ నిబంధనలు, మానవ హక్కులపై చేసుకున్న అంతర్జాతీయ ఒడంబడికలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఉద్దానం ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని, చెరువులు కలుషిత కాకుండా చూడాలని , కిడ్నీ బాధితులకు ఉచితంగా ఔషధాలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ చర్యల పర్యవేక్షణకు పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ చర్యలను పర్యవేక్షించేందుకు న్యాయసేవాధికార సంస్థలకు స్థానం కల్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాతంలోని ఏడు మండలాల పరిధిలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని... ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది కె. సింహాచలం, విశ్రాంత ఉపాధ్యాయులు అన్నెపు మహందాత హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ, న్యాయవాది సింహాచలం వాదనలు వినిపించారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసి తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఉద్దానం ప్రాంతంలో జీడిపప్పు పరిశ్రమలు, ఇటుక బట్టీల నుంచి వస్తున్న కలుషిత పదార్థాలు, వ్యర్థాలు చెరువుల్లో చేరకుండా తక్షణం చర్యలు చేపట్టాలని తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరిశ్రమలు లాభాలు ఆర్జించడానికి వీల్లేదని ఆదేశించింది.
అత్యవసరం ఉన్న కేసుల్లో వైద్య చికిత్స నిరాకరించే వీల్లేదు...
కిడ్నీ బాధితుల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్య కేంద్రాల, ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలు అందించాలని తెలిపింది. చికిత్సకు సంబంధించి రికార్డులను నిర్వహించి... భద్రపరచాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అత్యవసరం ఉన్న కేసుల్లో వైద్య చికిత్స నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు చికిత్స నిమిత్తం అన్ని మార్గాలను అన్వేషించాలని.. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. రోగి పేరు, వయసు, వ్యాధి, గతంలో చికిత్స అందించిన వైద్యాధికారి, పూర్వం ఎప్పుడు రోగిని పరిశీలించారు తదితర వివరాలను రిజిస్ట్రర్లలో నమోదు చేయాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో గందరగోళానికి తావులేకుండా ఈ వివరాలు సహాయపడతాయని సూచించింది. ఆసుపత్రుల్లో బాధితులు చేరిక విషయంలో సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇస్తుండాలని పేర్కొంది. పరిస్థితిని సమీక్షించేందుకు రెండు వారాలకోసారి సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. బాధితుడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ప్రాథమిక చికిత్స అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అత్యవసర కిడ్నీ కేసులకు చికిత్స అందించేలా ఉద్దానం ప్రాంతం గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల స్థాయిని పెంచాలని ఆదేశాల్లో పేర్కొంది.
కేంద్రీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి...
అన్ని గ్రామాల్లో ప్రత్యేక చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రస్థాయి ఆసుపత్రుల్లో పడకలు కేటాయించేందుకు కేంద్రీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పడక ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడికి పేషెంట్‌ను పంపడానికి వీలుంటుందని సూచించింది. పీహెచ్ సీల నుంచి జిల్లా, డివిజన్ స్థాయి ఆసుపత్రులకు రోగులను పంపేందుకు వైద్య సిబ్బంది, తగిన సౌకర్యాలతో అవసరాలకు తగ్గట్టు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలంది. కిడ్నీ బాధితులు, సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఉచితంగా ఔషధాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని... అన్ని పీహెచ్‌సీల్లో ఔషధాల నిల్వ ఉంచాలని సూచించింది. రోగులకు మెరుగైన సేవలు అందించే విషయంలో ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోల్లో పనిచేసిన సామాజిక నిపుణులు, వైద్యులు, కిడ్నీ వాధితో పూర్వం బాధపడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని తెలిపింది .
వారి పిల్లలు వివక్ష ఎదుర్కోకుండా చూడాలి...