Social Media Posts Against Judges: న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థను కించపర్చేలా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే జియో బ్లాకింగ్ విధానంలో వాటంతట అవే (ఆటోమేటిక్) తొలగిపోయేలా చేయడంపై వాదనలు వినిపించాలని హైకోర్టు సూచించింది. జియో బ్లాకింగ్ ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్.అశ్వనీ కుమార్, సామాజిక మాధ్యమాల తరఫు సీనియర్ న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదికి ఈ మేరకు సూచించింది. బ్లాకింగ్ ఉత్తర్వులు హైకోర్టు జారీ చేయొచ్చా? ఇందుకు అనుసరించాల్సిన విధానమేంటి? తదితర విషయాలపై వాదనలు చెప్పేందుకు సిద్ధపడి రావాలని పేర్కొంది. న్యాయ వ్యవస్థపై అనుచిత పోస్టుల వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ‘కొత్త సవాళ్లు ఎదురవుతున్నప్పుడు తీర్పులూ వినూత్నంగా ఉండాలి.పరిస్థితులకు తగ్గట్టు చట్టాల్లో మార్పులు రావాలి. పోస్టుల నిలవరింతకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి’ అని వ్యాఖ్యానించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ, అపకీర్తి పాల్జేసే రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. విచారణ వాయిదా - AP HC on Social Media Case
Social Media Posts Against Judges: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అసభ్య పోస్టుల కేసును ఉన్నత న్యాయస్థానం విచారించింది. తాజా నివేదికను సీబీఐ అధికారులు హైకోర్టుకు సమర్పించగా.. పంచ్ ప్రభాకర్ అరెస్టుపై ఏం చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది.
సోమవారం నాటి విచారణలో సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు స్పందిస్తూ.. దర్యాప్తు పురోగతి వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. ‘33 మందిపై కేసు నమోదు చేశాం. పంచ్ ప్రభాకర్‌కు చెందిన రెండు యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేశాం. అతని వ్యవహారాలపై దర్యాప్తు వేగంగా జరుగుతోంది. కేంద్రానికి లేఖలు రాశాం’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ‘అభ్యంతరకర పోస్టుల నిర్మూలనకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. పోస్టుల తొలగింపునకు ప్రతిసారి కోర్టులో పిటిషన్ వేయడం, న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం ఎంతకాలం కొనసాగించగలం? ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలి. జియో బ్లాకింగ్ విధానానికి ఆదేశాలివ్వలేమా?’ అని ప్రశ్నించింది. ఓ సామాజిక మాధ్యమం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ ‘మాధ్యమాలను వేదికగా చేసుకొని కొందరు పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఆ మృగాల స్వభావం అలాంటిది’ అని పేర్కొన్నారు. ‘జియో బ్లాకింగ్ అమలు అంత సులువు కాదు’ అని మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ స్పందిస్తూ ‘పంచ్ ప్రభాకర్‌పై ఫిర్యాదు ఆధారంగా రెండు యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్ చేశారు. అతని చర్యలను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాలి. అప్పుడు మిగిలిన వారు అదుపులో ఉంటారు’ అని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ పంచ్ ప్రభాకర్ ఓ వ్యక్తి మాత్రమేనని, జియో బ్లాకింగ్‌తో న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడటంపై దృష్టి పెడుతున్నామని పేర్కొంది.