గత ప్రభుత్వంలోని ముఖ్య నిర్ణయాల్ని తిరగదోడేందుకు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం.. దాని ఆధారంగా ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్వుల ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వానికి అపరిమితమైన పున:సమీక్ష అధికారం కల్పిస్తే.. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు అయ్యాక దుర్వినియోగం అయ్యేందుకు దారి తీస్తుందని.. స్పష్టం చేసింది. పునఃసమీక్ష అధికారం ఏ ప్రభుత్వానికి స్వతఃసిద్ధంగా లేదని పేర్కొంది. గత ప్రభుత్వ.. స్థాయిలో తీసుకున్న నిర్ణయాల్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు.. అంత సులువుగా రద్దు చేయకూడదని.. అసంపూర్ణంగా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వం పై ఉందని.. " స్టేట్ ఆఫ్ హరియాణ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్ని రాజకీయ కారణాలతో.. పునఃసమీక్షించడం లేదా విస్మరించడం చేయకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంచేసిందని.. హైకోర్టు గుర్తుచేసింది. రాజకీయ కారణాలతో, పక్షపాతంతోనో గత ప్రభుత్వ నిర్ణయాల్ని విస్మరించకూడదని.. సుప్రీం తీర్పుల ఆధారంగా అర్థమవుతోందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రం పురోగాభివృద్ధికి.. ప్రభుత్వ విధానాల్లో నిలకడ అవసరమని తెలిపింది. తీవ్రమైన చట్ట ఉల్లంఘనలు, స్పష్టమైన మోసం జరిగిన సందర్భాల్లో తప్ప.. రాజకీయ కారణాలతో ఇష్టానుసారంగా విధానాల్ని మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. దేశంలో అమల్లో ఉన్న చట్టాల ఉద్దేశం ఇదేనని.. ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.